తెలంగాణ ప్రభుత్వం స్థిరాస్తి కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. దీంతో ఇళ్లు, ప్లాట్లు, సాగు భూములు కొనుగోలు చేసేవారిపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరగనుంది. మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లోని ధరలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నారు. కొత్త ధరలు అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రజలు హైదరాబాద్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు తరలివస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ విలువను సుమారు 20 శాతం వరకు పెంచే యోచనలో అధికారులు ఉన్నారు.