దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ పార్కింగ్ ప్రదేశంలో రేకుల షెడ్లు వేయడానికి తవ్విన గుంతలను పూడ్చకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తుడి కారు గుంతల్లో కూరుకుపోయింది. గుంత లోతుగా ఉండటం, వర్షపు నీరు నిలిచి ఉండటంతో కారును బయటకు తీయడానికి మూడున్నర గంటలు పట్టింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంట్రాక్టర్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, పనులు పూర్తయిన వెంటనే గుంతలను పూడ్చి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.