రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌లో ప్రైవేట్ కంప్లైంట్ కేసులు, పాత కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని ఇన్ ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షురాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బి. పుష్పలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజల మేలు కోసం పెండింగ్‌లో ఉన్న చిన్న క్రిమినల్ కేసులు, ఇతర కంపౌండబుల్ కేసులను ఆధునిక పద్ధతుల్లో సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని తెలిపారు. కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించి, ప్రజలకు త్వరిత న్యాయం అందించాలని ఆమె గుర్తుచేశారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.