అనంతగిరి మండలం వెంకట్రామపురం ఇందిరమ్మ కాలనీలో పాముల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నిత్యం ఇళ్లలోకి, పరిసరాల్లోకి పాములు వస్తుండటంతో రాత్రిపూట బయటకు వెళ్ళడానికి ప్రజలు భయపడుతున్నారు. గతంలో పాము కాటుతో ఇద్దరు మరణించినట్లు చెబుతున్నారు. కాలనీలో విద్యుత్ దీపాలు లేకపోవడం, పారిశుద్ధ్యం లోపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.