తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం 94వ వార్షిక మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి ఉమర్ ఆలీషా జ్యోతి ప్రజ్వలనలతో సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమర్ఆలీషా మాట్లాడుతూ మానవుడు తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా జ్ఞాన నేత్రాన్ని పొందగలుగుతాడని తెలిపారు. తాత్విక జ్ఞాన నేత్రంద్వారా మాత్రమే తనలో నిండిఉన్న భగవంతుడిని దర్శించుకోగలడని వెల్లడించారు. మానవత్వపు విలువలు కోల్పోవడం వలన రాక్షసత్వం ఏర్పడుతుందని తాత్త్విక జ్ఞానం మానవుడిని భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింప చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠంమీడియా కన్వీనర్ ఆకుల రవి తేజ తదితరులు పాల్గొన్నారు.