పాలిసెట్-2025లో బాలికలు హవా సాగించారు. బాలురు కంటే 2.52 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్-2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విడుదల చేశారు. ఏప్రిల్ 30న జరిగిన ఈ పరీక్షలో మొత్తం 95.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,39,840 మంది హాజరవ్వగా, వీరిలో 1,33,358 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 54,722 మంది హాజరవ్వగా, 53,024 (96.9 శాతం) మంది అర్హత సాధించారు. బాలురు 85,118 మంది హాజరవ్వగా 80,334 (94.38 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 120 మార్కులకు జరిగిన పరీక్షలో 19 మంది 120 మార్కులు తెచ్చుకున్నారు.