తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.