జిల్లాలో కీలకమైన పూర్ణపాడు-లాబేసు వంతెన పనులకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తవడం లేదు. దీంతో ఎనిమిది పంచాయతీలు.. 36 గ్రామాల్లో వందలాది మంది ప్రజల కష్టాలు తీరడం లేదు. వారి నిరీక్షణ ఫలించడం లేదు. అత్యవసర సమయాల్లో ఆయా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే నగావళి నది దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నాయి. మండల కేంద్రం కొమరాడకు చేరుకోవాలంటే జియ్యమ్మవలస పరిధిలో ఉన్న గ్రామాల మీదుగా సుమారు 75 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. కొన్నేళ్లుగా ఆయా గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న గత టీడీపీ ప్రభుత్వం పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.