వాన ఎలా పడుతుందన్నదానిపై ఆధారపడి వానకు అనేక పేర్లు ఉన్నాయి. నిరంతరంగా కురిస్తే ముసురు వాన, తడిపేస్తే బట్ట తడుపు వాన, పైకప్పు నుంచి కారితే సూరునీళ్ల వాన, ఎక్కువైతే కుండపోత, తక్కువైతే ముంతపోత, వడగళ్లు ఉంటే రాళ్ల వాన, ఒకచోటే కురిస్తే కప్పదాటు వాన, రాత్రి పడితే దొంగ వాన, సాయంత్రం వస్తే మాపుసారి వాన, బాగా దంచి కురిస్తే జోరు వానగా పిలుస్తారు.