కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. శనివారం హుజూరాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాక ముందు రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు ఉండేవన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలను నివారించామని, కరెంట్ కోతలను లేకుండా నిరంతర విద్యుత్ అందించామని గుర్తు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్ లో మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి, తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు చేస్తుందని, దానికి సీఎం రేవంతర్ వత్తాసు పలుకుతాడని తెలిపారు.