విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రేమ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. దీంతో కట్టుకున్న భార్యను, బిడ్డను కాదని విద్యార్థినితో పారిపోయాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. సెంథిల్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కలితీర్థల్‌కుప్పం ప్రాంతానికి చెందిన మహేశ్వరి అనే యువతిని ప్రేమించాడు. 2006లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి కావడంతో ఇద్దరు కొంత కాలం అన్యోన్యంగా ఉన్నారు. అయితే పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. చివరకు 2018లో వీరికి ఓ పాప జన్మించింది. పాప పుట్టిన నాలుగేళ్ల తర్వాత భార్యాభర్తలిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇద్దరూ చీటికీ మాటికీ గొడవ పడుతుండేవారు.
ఈ క్రమంలో తాను చదువు చెప్పే స్కూల్ లో 9వ తరగతి విద్యార్థినితో సెంథిల్ కు పరిచయం ఏర్పడింది. ఈ గురు శిష్యురాలికి మధ్య మరింత చనువు ఏర్పడింది. ఆమె పదవ తరగతి పూర్తయ్యాక ఆమెను తన సొంత డబ్బులతో సెంథిల్ చదివించాడు. ప్రస్తుతం ఆ యువతి డిగ్రీ చదువుతోంది. ఇప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోవడానికి యువతి వయసు అడ్డుగా ఉండటంతో ఆగిపోయారు. తాజాగా తన భార్యకు సెంథిల్ విడాకుల నోటీసు పంపించాడు. భర్త నుండి వచ్చిన నోటీసు చూసి మహేశ్వరి షాక్ అయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి భర్త తీరుపై ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు తన శిష్యురాలితో వెళ్లిపోవడంతో అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థిని తో ప్రేమ పాఠాలు వల్లించడం పట్ల స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.