ఒడిస్సా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఆ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని బొల్లిని మెడిస్కిల్ల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా తొలుత గజపతి జిల్లా విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్ స్మృతి రంజన్ ప్రధాన్ సమక్షంలో అధికారులతోఎంవోయూ కుదిరిందన్నారు. ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదేళ్ళుగా 9200 విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 8800 మంది విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఒడిస్సా ప్రభుత్వం తమ సంస్థతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, తమ సంస్థ మరో మెట్టుకు ఎదిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గజపతి జిల్లా ఉపాధి కల్పనా అధికారి సౌభాగ్య ఎస్ఆర్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.