పల్లెల్లో మొదలైన టెన్షన్... 'స్థానిక సమరం' పై ఉత్కంఠ..!

6755చూసినవారు
పల్లెల్లో మొదలైన టెన్షన్... 'స్థానిక సమరం' పై ఉత్కంఠ..!
ఎన్నికల సంఘం శువ్రారం రాత్రి ఉన్నఫలంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యుల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై సంసిద్ధంగా లేదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న విషయంపై సర్వత్రా జిల్లాలో చర్చ సాగుతోంది.

ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కష్టమని తేల్చిచెప్పారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై న్యాయస్థానంను ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు సాగుతాయా లేదా అన్నది చర్చనీయాంశమైంది. ఇది వరకే ఎన్నికలకు సన్నద్ధమై చివరి నిమషంలో వాయిదా పడటంతో నిరుత్సాహపడిన అవుత్సాహిక నేతల్లో ఎక్కడలేని ఉత్కంఠ నెలకొంది.

గతంలో మార్చి నెలలో పంచాయతీ ఎన్నికల నోటిఫకేషన్‌ వెలువడనున్న సమయంలో ఎన్నికల సంఘం కోవిడ్‌ పెరుగుతోందంటూ వాయిదా వేసింది. ప్రభుత్వానికి సమాచారం లేకుండా వాయిదా వేయడం పట్ల అప్పట్లో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పట్లో ఎన్నికలు ఉండవనుకుంటున్న తరుణంలో శుక్రవారం రాత్రి సమయంలో ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించింది.

నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. ఈ మేరకు జిల్లాలో 1044 గ్రామ పంచాయతీలున్నాయి. 10,744 వార్డులున్నాయి. వీటిల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న మీమాంస ఉత్కంఠత నెలకొంది. సోమవారం నాడు కోర్టు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించనుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

కోడ్‌ అమల్లోకి
ఎన్నికల షెడ్యుల్‌ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లాలో జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్‌ పడింది. దీంతోపాటు త్వరలో పడుతాయనుకుంటున్న అమ్మఒడి పథకం కూడా నిలిచిపోయే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యుల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో శుక్రవారం రాత్రి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో జిల్లాలో అధికారులు కొన్ని చోట్ల రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టయింది. సోమవారం నాడు ఇచ్చే తీర్పు ఆధారంగా అధికారులు స్పందించే అవకాశా లుంటాయి. ఏది ఏమైనా అటు పోటీకి సిద్ధపడిన నాయకుల్లోనూ, ఇటు ఏర్పాట్లు చూడాల్సిన అధికారుల్లోనూ ఉత్కంఠత నెలకొంది. కోర్టు నిర్ణయం అనంతరం ఏమి చేయాలన్న దానిపై అందరిలోనూ స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్