నేరాల నియంత్రణ, ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు నర్సీపట్నం రూరల్ ఎస్సై పి. రాజారావు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రేవతమ్మ ఆదేశాల మేరకు నర్సీపట్నం - చింతపల్లి రోడ్డులోని నెల్లిమెట్టతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రధాన కూడళ్లలో సిబ్బందితో కలిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాల సమయంలో నిందితులను గుర్తించి కేసులను త్వరగా ఛేదించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. కాలనీల్లో ప్రజలు గ్రూపులుగా ఏర్పడి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారినపడితే 1930కు ఫోన్ చేయాలని తెలిపారు.