చెప్పాలని ఉంది & లవ్ టిప్స్ - Telugu Love Stories and Tips

ప్రేమలో గెలిచి..జీవితంలో నిలిచింది

ప్రేమలో గెలిచి..జీవితంలో నిలిచింది

నా పేరు స్వాతి (పేరు మార్చాం). మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. నేను ఇంటర్ చదువుతున్న సమయంలో కిరణ్ (పేరు మార్చాం) పరిచయం అయ్యాడు. అతని పరిచయం తన జీవిత భాగస్వామిగా మారుతుందని నేను ఊహించలేదు. కిరణ్ చాలా మెతక స్వభావి. సాటి వారికి సాయం చేసే గుణం ఎక్కువ. డిగ్రీలో కూడా మేం ఒకే కాలేజి. బస్సులో వచ్చి పోయేటప్పుడు కలిసి వెళ్లేవాళ్లం. ఓ రోజు క్లాస్ కు అకౌంట్స్ లెక్చరర్ రాలేదు. దీంతో పీరియడ్ ఖాళీగా ఉండడంతో అందరం ముచ్చట్లలో మునిగిపోయాం. ఇంతలో కిరణ్ బోర్డు దగ్గరికి వెళ్లి సైలెన్స్ అని అన్నాడు. ఆ తర్వాత తాను ఓ ఉపన్యాసం ఇచ్చాడు. మనమంతా వివిధ గ్రామాల నుంచి వస్తున్నాం. వెళ్తున్నాం. మనలో కూడా చాలా మందికి అనేక సమస్యలు ఉంటాయి. వాటి గురించి మనం ఏ రోజు పట్టించుకోం. మన చుట్టూ కూడా అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతుంటారు. వారి కోసం మనం మనకు తోచినంతలా ఏదైనా సాయం చేద్దామన్నాడు. మనమంతా ఫ్రెండ్స్ మాత్రమే కాదు కుటుంబ సభ్యులం కూడా అని చెప్పాడు. ఈ డిగ్రీ అయిపోగానే ఎవరి దారి వారు చూసుకొని పోవడం కాకుండా బత్రికున్నంత వరకు మనమంతా కలిసుండాలని చెప్పాడు. బాలసదన్ లో ఉండే అనాథ పిల్లలకు మనకు తోచిన విధంగా సాయం చేద్దామన్నాడు. మరుసటి రోజే కాలేజిలోని అన్ని గ్రూపులలో తిరిగి విరాళాలు వసూలు చేసి బాలసదన్ పిల్లలకు ఇచ్చాడు. అప్పుడు అతని మంచితనం నచ్చి నాకు తెలియకుండా నేనే అతని పై ప్రేమలో పడ్డాను. ఇంటర్ నుంచే స్నేహితుడు కావడంతో నాతో ఫ్రెండ్లీగానే ఉండేవాడు. నేనే ధైర్యం చేసి ఓ రోజు వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా కిరణ్ అని అడిగాను. అతను ఆశ్చర్యంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ స్వాతి అని ప్రశ్నించాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోయాడు. రెండు రోజుల వరకు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చి కోపమొచ్చిందా స్వాతి అని అడిగాడు. నేను అప్పుడు అతనితో మాట్లాడలేదు. అలా కాదు స్వాతి… పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడే కుదరదు కదా. మనం డిగ్రీనే చదువుతున్నాం. నాకు జాబ్ లేదు. నీకు జాబ్ లేదు. మీ ఇంట్లో వారు కూడా నీ గురించి ఎన్నో కలలు కని ఉంటారు వాటన్నింటిని నిరాశ చేయవద్దు అని చెప్పాడు. అప్పుడు చెప్పా ఈ మంచితనం వల్లే నీతో ప్రేమలో పడ్డానని. పెళ్లి చేసుకుంటే నిన్ను తప్ప మరేవరిని చేసుకోనని తేల్చి చెప్పాను. స్వాతి నువ్వంటే నాకిష్టం కానీ ప్రేమ పేరుతో మన జీవితాలు ఆగం చేసుకోవద్దని చెప్పాడు. జీవితంలో మనం మంచి స్థాయికి వచ్చాక పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఇంతలో మా పీజీలు పూర్తయ్యాయి. ఆ తర్వాత కిరణ్ కు ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నేను కూడా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాను. కిరణ్ దైర్యం చేసి వారింట్లో చెప్పాడు. ముందు వారి తల్లిదండ్రులు కోప్పడ్డారు. తర్వాత అర్దం చేసుకున్నారు. వారే వచ్చి మా తల్లిదండ్రులకు విషయం చెప్పారు. కులాలు వేరు కావడంతో పెళ్లి చేసే ప్రసక్తే లేదని మా తల్లిదండ్రులు చెప్పారు. ఆ తర్వాత నెల రోజలకు మా తల్లిదండ్రులే వారికి ఫోన్ చేసి మాట్లాడారు. అలా మా ఇద్దరి పెళ్లికి శుభం కార్డు పడింది. ఎలాంటి గొడవలు లేకుండానే మా పెళ్లి ముందుకు సాగింది. బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి ఘనంగా జరిగింది. ప్రస్తుతం మాకు ఇద్దరు పిల్లలు. మేం ఆనందంగా జీవిస్తున్నాం. మా అత్తమామలు నన్ను చాలా బాగా చూసుకుంటారు. ప్రస్తుతం మేం హైదరాాబాద్ లో ఉంటున్నాం. కిరణ్ కూడా తన కంపెనీలో కీలక స్థాయిలో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దీంతో మా కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని నా జీవితానికి నేనే బాటలు వేసుకోవడాన్ని తలుచుకుంటే నిజంగా ఆనందాన్నిస్తుంది. "చెప్పాలని ఉంది" చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి. గమనిక.. వారానికి ఒక కథను మాత్రమే ప్రచురిస్తాం. దీనిని లోకల్ యాప్ ట్రెండింగ్ కేటగిరిలో చూసుకోవచ్చు. ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.