బీసీలకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ,బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు కాకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని సూచించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కూడా అవసరమని, రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా, సమగ్ర డేటా ఆధారంగా, కోర్టుల్లో నిలిచేలా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీల హక్కుల పరిరక్షణే లక్ష్యమని స్పష్టం చేశారు.