AP: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల విడుదల వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న విడుదల కావాల్సిన ఫలితాలు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం కల్పించిన నేపథ్యంలో జూన్ 18 తర్వాత ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈఏపీసెట్ ర్యాంకులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, సప్లిమెంటరీ ఫలితాల తర్వాత ర్యాంకుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.