ఉండ్రాజవరంలో జనసంఘ్ వ్యవస్థాపకుల్లో కీలక నాయకుడు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను భాజపా నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాజపా జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ మాట్లాడుతూ భారతీయ రాజకీయాల్లో సిద్ధాంతం, సేవ, సంస్థాగత నిర్మాణం, అంత్యోదయ భావనలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు దీనదయాళ్ ఉపాధ్యాయ అని పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్గా దేశసేవకు అంకితమైన ఆయన, అనంతరం భారతీయ జనసంఘ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.