అల్లవరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం డ్వాక్రా మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రాజెక్టు అదనపు మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గి పెట్టుబడి కలిసి వస్తుందని తెలిపారు. వివిధ గ్రామ సంఘాల నుండి ఎంపిక చేసిన 49 మంది మహిళలకు ప్రకృతి సాగు పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు పోతురాజు ప్రసన్నకుమార్, దుర్గారావు అవసరమైన మెళకువలను వివరించారు.