పిఠాపురం రాజకీయాల్లో టీడీపీ, జనసేన మధ్య సమన్వయం లోపించడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విభేదాలు, నాయకుల మధ్య మాటల యుద్ధం, కేడర్‌లో అసంతృప్తి నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పించి, త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జనసేన కేడర్ ఆధిపత్యం, టీడీపీ నాయకుల్లో అసంతృప్తి, ప్రోటోకాల్ వివాదాలు, ఫ్లెక్సీల అంశం వంటివి వివాదాలకు దారితీశాయి. చంద్రబాబు ఫొటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారంపై జనసేన నేత దొరబాబు, వర్మ వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో అధిష్టానం జోక్యం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.