నిడదవోలు మండలం మునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రెండు నెలల క్రితమే కుటుంబ పెద్దను రోడ్డు ప్రమాదం కబళించగా, ఇప్పుడు ఆరేళ్ల కుమారుడు కూడా అదే తరహా ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన అత్తిలి భరత్ (6) నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సాయంత్రం బిర్యానీ తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై కానూరు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మునిపల్లిలోని రామాలయం వద్ద కానూరు నుంచి డి.ముప్పవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో భరత్ లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తల్లి దుర్గాభవాని కుమారుడి మృతి వార్తతో కుప్పకూలిపోయింది. బంధువుల రోదనలతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. భరత్ కానూరులోని ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.