నరసరావుపేట టూ-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేసి, కందుకూరి వీరశేఖరాచారి, లలిత అనే ఇద్దరిని నంద్యాల జిల్లా మహానంది వద్ద అరెస్ట్ చేశారు. వీరు సుమారు 15 ఏళ్లుగా బెట్టింగ్‌లతో పాటు మోసాలకు పాల్పడుతున్నట్లు, వీరిపై 12 బెట్టింగ్ కేసులు, ఒక పోక్సో కేసు, రెండు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అధిక లాభాల పేరుతో ట్రేడింగ్ చేస్తామని నమ్మించి కళ్యాణ చక్రవర్తి అనే వ్యక్తి నుంచి రూ. 1.44 కోట్లు మోసగించినట్లు విచారణలో వెలుగుచూసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.