నిజాంపట్నం మండలం పసుమర్తిపాలెంలో శుక్రవారం పొలంబడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి చుక్క విజయరాజు మాట్లాడుతూ, రైతులు శత్రు పురుగులు, మిత్ర పురుగుల నిష్పత్తిని తెలుసుకోవాలని సూచించారు. విచ్చలవిడిగా రసాయన పురుగుమందులు వాడటం వల్ల పంటలకు మేలు చేసే కందిరీగ, తూనీగ, సాలీడు, అక్షింత పురుగులు నశించిపోతాయని తెలిపారు. రైతులు వేప గింజల కషాయం వంటి సహజ పద్ధతులు వాడితే మిత్ర పురుగులు వృద్ధి చెంది రైతులకు సహాయపడతాయని ఆయన అన్నారు.