పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఇనిమెళ్ల గ్రామంలో ఒక పురాతన ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఏడు పంచలోహ విగ్రహాలు, మూడు రాగి రేకులు లభ్యమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్. ఆంజినేయులు స్వగ్రామమైన ఇక్కడ, శిథిలావస్థకు చేరిన భావన్నారాయణ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని ఒక పాత బావిని శుభ్రం చేస్తుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఆంజినేయులు దేవదాయ శాఖ, పురావస్తు అధికారులకు సమాచారం అందించారు. ఈ విగ్రహాల చారిత్రక ప్రాధాన్యతపై అధికారులు పరిశోధన చేస్తున్నారు. శతాబ్దాల క్రితం దండయాత్రల భయంతో విగ్రహాలను బావుల్లో దాచి ఉండవచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు.