AP: ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారి, 23న ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.