రంగాపురం రత్తయ్య గారికి ఘన సత్కారం – కోళ్ల క్రీడను కూటీర పరిశ్రమగా గుర్తించాలని విజ్ఞప్తి

మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన కోళ్ల క్రీడను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సంప్రదాయానికి గుర్తింపు తీసుకువచ్చిన రంగాపురం రత్తయ్య గారిని ఈరోజు (05-08-2026) కోళ్ల రైతుల సమక్షంలో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ మరియు కోనసీమ మీడియా ప్రతినిధి పవన్ కలిసి రంగాపురం రత్తయ్య గారికి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ, ప్రస్తుతం కోళ్ల పెంపకం ఒక కూటీర పరిశ్రమగా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షకు పైగా కుటుంబాలు నాటు కోళ్లు, జాతి కోళ్ల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ రంగాన్ని అధికారికంగా కూటీర పరిశ్రమగా గుర్తించి, కోళ్ల పెంపకందారులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అందిస్తే ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

రంగాపురం రత్తయ్య మాట్లాడుతూ ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రమే ఇచ్చే కోళ్ల క్రీడ అనుమతులను దసరా, వినాయక చవితి, ఉగాది వంటి ఇతర ప్రధాన పండుగల సందర్భంగా కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడుకు జల్లికట్టు ఎంత ముఖ్యమైన సాంస్కృతిక సంప్రదాయమో,మన తెలుగు ప్రజలకు కోళ్ల క్రీడ కూడా అంతే ముఖ్యమైన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, కోళ్ల క్రీడకు చట్టబద్ధత కల్పిస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.

కోనసీమ మీడియా ప్రతినిధి పవన్ మాట్లాడుతూ, ఒంగోలు ఆవులు, మన దేశీయ జాతి కోళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందినవని, వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మన సంప్రదాయాలు, స్థానిక జాతులను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్