భూ రీసర్వేలో జరిగిన అవకతవకలు, భూఆక్రమణలపై అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సాకా రామకృష్ణ, బోనసుల శివ, సురవరపు దివాణం మాట్లాడుతూ రీ సర్వేలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడంతో పాటు భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని బాధిత రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, బొజ్జ పెద్దకాపు, ఖండవల్లి సుబ్బారావు, నాగేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.