మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ క్రిమినల్, దోపిడీ విధ్వంసాల క్రెడిట్‌ను ఎవరూ దొంగిలించలేరని, తన పాలనలో చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేసేందుకు జగన్ యత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ అబద్ధాలకు ఆయన సైకో బ్యాచ్ ప్రచారం చేస్తోందని, అవినీతి క్రెడిట్‌ను ఎవరూ దొంగిలించలేరని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేని క్రెడిట్ జగన్‌దేనని, రాష్ట్రానికి విధ్వంసకారుడు, దోపీడీదారుడనే క్రెడిట్ జగన్‌కే సొంతమని అన్నారు. సొంత బాబాయ్‌ను హత్య చేసి, పిన్నమ్మ తాళిబొట్టు తెంచిన కేసులో జగన్ ఆడిన డ్రామాల క్రెడిట్ కూడా ఎవరూ దొంగిలించలేరని, కన్నతల్లి, సొంత చెల్లిని రోడ్డున పడేసిన క్రెడిట్ ఎవ్వరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. ల్యాండ్, సాండ్, మైన్, వైన్, గంజాయ్ వంటి క్రెడిట్‌లతో యువత సహా ఎందరో జీవితాలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. దుర్మార్గమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, 151 స్థానాలు వచ్చిన పార్టీని 11కు దిగజార్చిన క్రెడిట్ ఒక్క జగన్‌ది మాత్రమేనని విమర్శించారు. అమరావతి తీర్మానంపై సమాధానం చెప్పలేక, కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలకు ఇక పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. వైసీపీ భవిష్యత్తు ఇక అంధకారమేనని, కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ వైసీపీ పన్నే కుట్రలు ఇక పారవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చంద్రబాబు చరిత్రకారుడిగా గుర్తుండిపోతే.. జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.