కర్నూలు జిల్లా, మంత్రాలయం సమీపంలోని పెద్దకడబూరు మండలం జాలవడి గ్రామంలో శ్రీ భీమరాయ స్వామి రథోత్సవం బుధవారం అశేష భక్త జనసందోహం మధ్య ఘనంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి నాగరాజు స్వామి, ధర్మకర్త విరూపాక్షి గౌడ్ ఆధ్వర్యంలో స్వామివారికి ఆకుపూజ, మంగళహారతి వంటి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తి నినాదాల మధ్య రథోత్సవం కన్నుల పండువగా సాగింది. గ్రామంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది.