AP: రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేసి కార్పొరేట్లకు దోచిపెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి లోకేశ్ 99 పైసలకే కార్పొరేట్లకు భూములిచ్చేస్తామని మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 2,500 ఎకరాలను పరిశ్రమల కోసం ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించాలని నీతి ఆయోగ్ నివేదిక సూచించిందని, దీనిపై ప్రశ్నించిన సీపీఎం నాయకుడు అప్పలరాజును అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. కొత్త ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా సీపీఎం జనవరి 18 నుంచి 31 వరకు ర్యాలీలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తామని, 14న కొత్త ఉపాధి చట్ట ప్రతులను భోగి మంటల్లో దహనం చేయాలని పిలుపునిచ్చారు.