పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులో జాతీయ రహదారి–44పై సోమవారం ఆర్టీసీ బస్సు డివైడర్‌పై బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. వనపర్తి డిపోకు చెందిన ఈ బస్సు కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి వనపర్తికి వెళ్తుండగా, డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు, పోలీసులు, 108 సిబ్బంది సహాయంతో క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 10 మందిని కర్నూలు, ఎనిమిది మందిని పెబ్బేరు పీహెచ్‌సీ, నలుగురిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.