శుక్రవారం వినుకొండ కారంపూడి రోడ్డులోని చెక్కవాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వేముల అశోక్ (25) అనే యువకుడు మృతి చెందాడు. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటకు చెందిన అశోక్, ప్రసన్న ద్విచక్ర వాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా, ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రసన్నకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుల్లారావు తెలిపారు.