ప్రకాశం జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదంటూ అల్లుడు మామ, అత్తలపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన దోర్నాల మండలం చింతల గ్రామంలో చోటుచేసుకుంది. అల్లుడు హనుమయ్య చేతిలో తీవ్రంగా గాయపడ్డ మామ భూపని నాగన్న, అత్త వెంకటమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.