AP: తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల వేళ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన ఐదుగురు సీనియర్ నాయకులు తిరుపతి రూరల్ మండల టీడీపీ మాజీ కార్య దర్శి బిరుదాల భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సరస్వతి, టీడీపీ సీనియర్ నేతలు ఎస్.వెంకటేష్ నాయుడు, టి.లక్ష్మినారాయణ, పి.మనోహర్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడం, చులకన భావంతో వ్యవహరించడం వల్లే పార్టీ నష్టపోతోందని వారు ఆరోపించారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఎమ్మెల్యే తీరే కారణమని వారు పేర్కొన్నారు.