ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన ప్రతి వినతిని అధికారులు ప్రాధాన్యతతో స్వీకరించి, నాణ్యత, పారదర్శకతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియాతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయి విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. నేడు జిల్లా వ్యాప్తంగా మొత్తం 220 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.