పాఠశాలల్లో విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న చైతన్య శిబిరాలు నిర్వహణ స్ఫూర్తి దాయకంగా ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఎస్ఈఐఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పారుపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాత్రుని రమణ మూర్తి జిల్లా కలెక్టర్ ను బుధవారం కలిసి ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. బలవన్మరణాలు లేని సమాజ నిర్మాణం కోసం గుంటూరు కేంద్రంగా చైర్మన్ ఈద శామ్యూల్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిల్లో చైతన్య శిబిరాల ను నిర్వహిస్తున్నట్లు, విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపుతున్నట్లు వెల్లడించారు. ఫౌండేషన్ సేవలను కలెక్టర్ కు వారు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ తరహా సేవలు అందించడం అభినందనీయమని పాఠశాల విద్యార్థుల్లో నైతిక ధైర్యం నింపే ఈ తరహా శిబిరాల నిర్వహణకు తన సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సామాజిక సేవా బాధ్యత గురుతరమైనదని కితాబు నిచ్చారు.