ఒడిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి నదిలోకి వరద నీరు చేరి ఉధృతి పెరిగింది. దీంతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నాగావళి నది పరీవాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. శ్రీకాకుళం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న నాగావళి నది వరద పరవళ్లతో ఉగ్రరూపం దాల్చింది. అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైక్లోన్ సెల్ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని వంశధార, బాహుదా నదులలోకి కూడా వరద నీరు వస్తోంది. గురువారం ఉదయం 8 గంటలకు వంశధార ప్రాజెక్ట్ డీ.ఈ. సరస్వతి తెలిపిన వివరాల ప్రకారం, 35,938 క్యూసెక్కుల నీరు చేరింది. కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేసి, నదిలోకి నేరుగా నీటిని విడుదల చేస్తున్నారు.