ప్రపంచ కుష్టువ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా బొబ్బిలిలోని ప్రేమ నగర్ కాలనీలో కారుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు మాట్లాడుతూ కుష్టువ్యాధి నిర్మూలన అవగాహనతోనే సాధ్యమని, బాధితులు ఆత్మస్థైర్యంతో జీవించాలని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకూడదని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని, వారి జీవనోపాధికి, పిల్లల విద్యకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం 52 కుటుంబాలకు ఖర్జూరం, అరటి పండ్లు పంపిణీ చేశారు. వ్యాధిగ్రస్తులకు సహాయ సహకారాలు అందిస్తామని సభ్యులు తెలిపారు.