బలిజిపేట మండలంలోని గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపర్చే లక్ష్యంతో, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం గ్రీన్ అంబాసిడార్లకు రిక్షాలు, తొట్టెలను పంపిణీ చేశారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఈ సామగ్రిని అందజేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని సూచించారు. విధులను సక్రమంగా నిర్వర్తించే వారికి ప్రతినెల జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.