భీమిలి పరిధిలోని గొల్లల ఎండాడ ప్రాథమిక పాఠశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన ఆయన, చిన్నారులతో ముచ్చటించి వారి ఆటపాటలను అభినందించారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని వడ్డించడమే కాకుండా, వారితో కలిసి కూర్చుని భోజనం చేశారు. పాఠశాల ప్రధాన గేటు వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టును త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రాంగణంలోని బోరు బావి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల అడ్మిషన్ల సమస్యపై జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.