ఏప్రిల్ 15 నుంచి 61 రోజుల పాటు కొనసాగిన చేపల వేట నిషేధం జూన్ 14తో ముగిసింది. దీంతో జూన్ 15 నుంచి మత్స్యకారులు తిరిగి వేటకు సిద్ధం కావచ్చని మత్స్యశాఖ జేడీ పి. లక్ష్మణరావు తెలిపారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, బోటు యజమానులు వేటకు వెళ్లే ముందు ఇంజిన్ల స్థితిని, బోటు లైసెన్స్, సిబ్బంది ఐడీ కార్డులను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అమర్చిన ట్రాన్స్‌పాండర్లను ఎల్లప్పుడూ ‘ఆన్’లో ఉంచాలని, విదేశీ జలాల్లోకి ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలని, బోట్లలో లైఫ్ జాకెట్లు, ప్రథమ చికిత్స పెట్టె, అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.