ఏలూరు జిల్లా కుక్కునూరు, దామరచర్ల గ్రామాల్లో గాంధీ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్ట పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ. రవి మాట్లాడుతూ, గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీలకు జీవనాధారమైన జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ స్ఫూర్తితో కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొత్త పథకాల పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీస్తోందని, 100 రోజుల పని కూడా పూర్తిగా అమలు కావడం లేదని, 125 రోజుల పని అంటూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కేంద్రం నిధుల వాటా తగ్గించడం, రాష్ట్రాలపై భారం మోపడం, పనుల నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవడం వంటి చర్యలు చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలేనని, జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.