ఆస్తి విషయంలో బంధువుల మధ్య పెరిగిన స్పర్ధలు ఉండిలో ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి దారితీశాయి. మంగళవారం కేసు నమోదైంది. ఉండి బాలాజీరావుపేటలో స్థలం విషయంలో శేషాద్రి శివశంకర్ శ్రీనివాస్ నాగకుమార్ (శేషాద్రి శ్రీను)కు, అతని బంధువులు దోస ఫణీంద్రకుమార్, అతని భార్య అనితకు మధ్య వివాదం నడుస్తోంది. పెద్దల సమక్షంలో జరిగిన సర్దుబాటు ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఫణీంద్రకుమార్, అనితలు శ్రీను ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీను ఎడమ ఉదరంలోంచి పేగులు బయటకు వచ్చాయని అతని భార్య ధనలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధనలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.