రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 4 నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న "రైతు వారోత్సవాలను" రైతులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. బుధవారం తాంసి మండలం హాస్నాపూర్ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి రైతు దరికి చేర్చడానికి ఈ వారోత్సవాలు ఒక గొప్ప వేదికగా నిలుస్తాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సంప్రదాయ పద్ధతులను వీడి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.