అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం, టేకాఫ్ అయిన 32 సెకెన్లకే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయిన ఘటనకు శుక్రవారంతో ఏడాది పూర్తయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మంది మరణించగా, విశ్వాస్ కుమార్ రమేశ్ అనే వ్యక్తి ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. నాటి విషాదం, చేదు జ్ఞాపకాలు తనను ఇంకా వెంటాడుతున్నాయని, నిద్రలేని రాత్రులు గడుపుతూ రోజూ చస్తున్నానని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు. ప్రమాదానికి ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ మద్దతు ఇవ్వడానికి ఎయిర్ ఇండియా కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధి తెలిపారు.