దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల దోమల సంతతి పెరిగి మలేరియా వ్యాప్తి అధికమైంది. ముఖ్యంగా జార్ఖండ్‌లో సెరిబ్రల్ మలేరియా బారిన పడి ముగ్గురు చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా వ్యాపించే మలేరియా, ముదిరినప్పుడు మెదడుపై ప్రభావం చూపితే సెరిబ్రల్ మలేరియాగా మారుతుంది. ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనే పరాన్నజీవి వల్ల వచ్చే ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్, మెదడులోని రక్తనాళాలను అడ్డుకుని వాపు, మెదడు దెబ్బతినడానికి కారణమవుతుంది.