TG: మెదక్ జిల్లా రామాయంపేట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట శనివారం రైతులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం లేదని, సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో విద్యుత్ సరఫరా చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.