హనుమకొండలో విషాదం.. స్విమ్మింగ్‌ పూల్‌‌లో శవాలై తేలిన తల్లీకూతుళ్లు..

హనుమకొండ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. తల్లీ, ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్ ‌పూల్‌లో శవాలై తేలారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హత్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు 8 ఏళ్ల ఉమేరా, 6 ఏళ్ల అయేషా ఉన్నారు. అజారుద్దీన్‌కు స్థానికంగా స్విమ్మింగ్ పూల్ ఉంది. దాని నుంచి వచ్చే ఆదాయంతో కుటుంబం జీవనం సాగిస్తోంది. బుధవారం రాత్రి కుటుంబం మొత్తం స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లింది. ఏమైందో ఏమో తెలీదు.. ఫర్హత్, ఆమె ఇద్దరు కూతుళ్లు స్విమ్మింగ్ పూల్‌లో శవాలై తేలారు. కుటుంబసభ్యులు శవాలను స్విమ్మింగ్ పూల్‌నుంచి బయటకు తీసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫర్హత్ ఇటీవల మూడోసారి గర్భం దాల్చిందని, ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. కూతురు, మనవరాళ్ల మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్