బైక్‌పై ల్యాప్‌టాప్.. కమీషనర్ సజ్జనార్ తీవ్ర స్పందన

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, రద్దీ రహదారిపై బైక్ నడుపుతూనే ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న యువకుడి వీడియోపై తీవ్రంగా స్పందించారు. "ప్రతి పనికీ ఒక పద్ధతి ఉంటుంది. కానీ ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగ ఒత్తిడి, పనిభారం, సమయాభావం పేరుతో ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడటం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని, రోడ్డుపై దృష్టి మరలితే అది మీకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. "కడుపు నింపుకోవడానికి చేసే పని.. కడతేర్చేలా ఉండకూడదు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. రహదారి భద్రత అందరి బాధ్యత అని, ప్రయాణ సమయంలో పూర్తిగా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్