మేడ్చల్ జిల్లా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని లెక్చరర్ల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీఎస్సీ డేటా సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న తిరునాయన, అనారోగ్య కారణాలతో తరచూ కళాశాలకు హాజరు కాలేకపోయినా, డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించి పరీక్షలు రాస్తున్నట్లు తెలిపింది. మొదటి సంవత్సరం నుంచే లెక్చరర్లు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని, వ్యక్తిగత ఫోటోలను షేర్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించింది. ఇటీవల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలోనూ మానసిక ఒత్తిడికి గురిచేశారని, కాలేజీకి రాకుండా ఎవరితో తిరుగుతున్నావని అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. బాధితురాలి తల్లి లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.